‘బ్లాస్యం’ మెచ్చిన టపాలు
అడపా దడపా అంటే పనీ పాటా ఉద్యొగం సజ్యోగం లేనప్పుడు మేము ఇలా మాకు నచ్చిన టపాలు వెలువరిస్తాము. ఒక్క సారి బండి గాడి లో పడ్డాక మా బుర్రల్లో, మా కన్ను తొర్రల్లో పడ్డ హాస్యం టపాల్ని నెల వారీ నరుక్కొచ్చి మీ ముందుపెట్టి ‘ఆ’ నెల ఉత్తమ టపా అని నెత్తిన ఓ పెద్ద కిరీటం పెట్టి దాని నెత్తినో వజ్రం పెట్టి మీ ముందుకు తోస్తాం. అంత వరకు ఇలా చేతికి దొరికిన మాంచి “డి బెస్టూ” అనే టపాల్ని వల వేసి పట్టుకొస్తాం. ప్రస్తుతానికి వాటిని మీరు ఆరగిస్తూ వుండండి.
‘సొట్ట’ బద్దమైన హెచ్చరిక: కాఫీలు తాగుతూ, బాసు తో ఫోనులో మాట్లాడుతూ, గరల్ ఆర్ బాయి ఫ్రెండు తో మాట్లాడుతూ ఈ టపాలను అసలు చదవొద్దని గాఠ్ఠి హెచ్చరిక. దాని తరువాత వచ్చే పర్వవసానాలకు మీ కళ్ళు, పొట్ట దే బాధ్యత. కాఫీ పోతే ఇంకో కప్పు కొనుక్కోవచ్చు.గరలో బాయో పోతే ఇంకో గరలో బాయో దొరకచ్చు ఉద్యోగం పోతే అంతే సంగతులు పైన చెవ్రాలు లేదు.
ఉప్మా పురాణం
ఉప్మానా! నేను చస్తే తినను అని అనే వాళ్ళ ముందర ఒక పళ్ళెం నిండా ఉప్మా పెట్టి ఈ టపా చదివిస్తే ఇంకో పళ్ళెం కావాలని అడుగుతారు అంతగా మైమరపిస్తుందీ టపా. ఉప్మాకు టాటా చెప్పినవాళ్ళును లొట్టలేసుకొని చదివించే టపా. అప్పుడేమి జరిగిందంటే అని మొదలుపెట్టి చదివిన వాళ్ళ పొట్టలకు ఇప్పుడేమి జరుగుతుందో అని అనిపింపచేస్తారు క్రాంతి గారు.
బ్లాగు సింహా రెడ్డి
కొన్ని సింహాలుంటాయి. అవి రాయలసీమలో కూడా వుంటాయి. అవి అప్పుడప్పుడూ బ్లాగులో కొస్తాయ్. అలా వచ్చినప్పుడే పౌరుషాన్నంతా బయటికి వెళ్ళగక్కుతాయ్. ఆ సింహాన్ని కదిలించినప్పుడు మాట్లాడిందే ఈ టపా. జంబలకిడి పంబ నుండి వచ్చిందీ టపా.
నమ్మ బెంగళూరు
“రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరబాద్..రిక్షావాలా జిందాబాద్..” అని హైదరాబాద్ లో ఆనందంగా తిరిగిన త్రివిక్రమ్ గారు బెంగళూరి నగర దల్లి “రవి వర్మదా చిక్కదా ఒందే ఒందు…” అని ‘హా’టలు ‘హా’డుకుంటూ, భాష బాధలు ఓర్చుకుంటూ తియ్యగా రాసిన టపా. త్రివిక్రమ్ తన అనుభవాన్నంతా రంగరించి రాయబోయే ‘హ’ది రోజుల్లో కన్నడ నేర్చుకోడమెలా? అనే పుస్తకం కాపీలు కావలంటే నేడే రిజర్వు చేసుకోండి. రేపుంటాయో లేదో తెలీదు.
మస్కిటో మక్కా
కుక్క కరిస్తే డాక్టర్ దగ్గరికెళ్ళి బొడ్డు చుట్టూ పాతికో పరకో ఇంజెక్షన్‌లు వేయించుకోవచ్చు. కానీ దోమే వంద ఇంజెక్షన్‌లు వేస్తే ఏమవుతుంది? అవి కూడా ‘ఒంగోలు గిత్త’ లా ఫేమస్ అయిన ‘తాడేపల్లి గూడెం’ దోమ కుడితే ఏమవుతుంది. ఇంకేమవుతుంది ఒక టపా తయారవుతుంది. దోమ బాధలు భరించి మీకు సంతోషాన్నిస్తూ సంతోష్ సూరంపూడి ‘నేను మీ పక్కింటబ్బాయ్’ అని చెబుతున్న కథనం.
మీర్రాసిన టపా హిట్టా ఫట్టా – విశ్లేషణాత్మక వ్యాసం
మీరు రాసిన టపా హిట్టా పట్టా అంటూ ఎక్కడా విహరించకుండా బ్లాగుల్లో విహరిస్తున్న విహారి రాసిన టపా.మీరు బ్లాగులు రాస్తుంటే వాటి భవిష్యేత్తేమిటో తెలియాలి కదా. అలా మీరు రాసే టపా హిట్టో ఫట్టో తెలుసుకోవాలనుందా? అయితే ఓ లుక్కేసుకోండి.
క్రేజీ కాంబినేషన్స్
బ్రాందీ, విస్కీ, ఓడ్కా లతో పాటూ కొన్ని పళ్ళ రసాలు కలిపితే అది కాక్ టైల్. అదే ఇడ్లీ తో ఆమ్లెట్, గోంగూరతో కొబ్బరి కాయ, టీ లో జిలేబీ, చేపల పులుసుతో బూందీ లడ్డూ లాంటి క్రేజీ కాంబినేషన్‌లు విన్నారా? వీటినే మంటారో తెలుసా? దీని గురించి తెలుసుకోవాలంటే బ్లాగుల్లో మహిళలకు ప్రమదా వనం అంటూ కాగాడా పట్టుకుని దారి చూపిస్తున్న జ్యోతి గారు బ్లాగునో సారి చూడండి.
పుచ్చకాయ పచ్చడి చేద్దాం రా..!!!.( సినిమా..)
బావా బావా పన్నీరు ..బావను పట్టుకు తన్నేరు అనే వాళ్ళు బ్లాగులు లేనప్పుడు. బ్లాగులొచ్చిన తరువాత బావను పట్టుకుని ఎలా ఏడిపించచ్చో తెలుసుకోవాలంటే ఓరుగల్లు మీనాక్షి గారిని అడిగి తెలుకోండి. ఎవరి కైనా కోపమొస్తే పుచ్చ లేచి పోద్ది రేయ్ అంటారు. ఈ పుచ్చకాయ పచ్చడి టపా చదివితే ఇల్లంతా రచ్చ రచ్చ చేస్తారు.
అమ్మాయిలు - ఆంటీలు
“యవ్వనం గువ్వ లాంటిది ఎగరనీ పైకెగరనీ…” అని ఎంత పైకైనా ఎళ్ళి పాడుకోవచ్చు గానీ వయసు పైకెళ్ళకూడదు. పిడుగు పాటు నైనా భరించవచ్చేమో కానీ ఈ అంటీ పిలుపు పోటుని భరించలేకున్నామని బ్లాగు లోని సుకుమార రమణులందరూ ముక్త కంఠంతో ఒప్పుకుంటూ నీరాజనాలర్పించిన టపా. మనసులోని మాట అంటూ తన అనుభవాల దొంతరలను అక్షరీకరించి బ్లాగులోకం లో ప్రవాహం లా సాగిపోతున్న సుజాత గారు రాసిన టపా ఇది. మిస్సయితే మీరు బామ్మో తాతో అయినట్లే.
ఆకాశ వీధిలో ‘ ఆకుపచ్చ కన్నీరు ‘
భామి మీదుంటే బాధలుంటాయి. భూమి లోకి పోతే బాధలు పోతాయ్. కానీ గాల్లో విమానం లో వుంటే పరిస్థితేంటి? సహజంగా కిందకి చూస్తూ కునుకు తీస్తాం. కానీ పక్కకి చూస్తే? దినకర్ వుంటే? కన్నీరు రంగు మారుద్ది. బ్లాగు గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? తోట రాముడు అంతే.
షరతుల పెళ్ళికొడుకులు - I
“తాళి కట్టు శుభ వేళ మెడలో కళ్యాణ మాలా…” అని పాడుకోవాలంటే ముందు మెడలో ఓ బోర్డు పెట్టుకుని వెళ్ళాలి నేను పెళ్ళికి రెడీ అని. అలా పెళ్ళి కి రెడీ అని మెడలో బోర్డు పెట్టుకుని డోలు వాయించుకుంటూ ఎటు వంటి పెళ్ళాం కావాలో అని చెబుతున్న పెళ్ళి కాని ప్రసాద్ ల పై ఓ హాస్య సెటైరు. వధువు కావలెను అని ప్రకటన లిచ్చిన వారిపై అష్ట దిగ్గజాల్లో ఒకరైన తెనాలి రామలింగడి పేరుతో బ్లాగు లోకం లో అలరారుతున్న వికటకవి గారి నుండి వెలువడింది.
posted in మెచ్చిన టపాలు | 327 Comments